స్మార్ట్‌ఫోన్ కొనాలని ఉంది. కానీ ఏది కొనాలో అర్థం కావడం లేదు. ఫీచర్స్ విషయంలోనూ గందరగోళంగా ఉంది. డిస్‌ప్లే ఏది బాగుంటుందో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితి స్మార్ట్‌ఫోన్ కొనే సమయంలో అందరికీ ఎదురవుతుంది. మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే కనుక ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోండి. మీ ఫోన్ ది బెస్ట్‌గా ఉంటుంది.
మార్కెట్లో నెలకో కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్ విడుదల అవుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ప్రతీ మోడల్‌లో ఏమేం ఫీచర్లున్నాయో తెలుసుకోవడం కష్టమే మరి. కొందరు ఇంటర్నెట్‌లో చూసి, స్పెసిఫికేషన్ వివరాలు తెలుసుకుని కొనుగోలు చేస్తుంటారు. అయితే కొందరికి సమయం ఉండదు. నెట్‌పై అవగాహన ఉండదు. అలాంటి వారు ఈ కింది అంశాలను దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్ కొనే ముందు మీ అవసరాలకు సరిపోయే విధంగా ఉండాలనే విషయాన్ని మరవద్దు. ముందుగా మీ బడ్జెట్‌లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. తరువాత ఆపరేటింగ్ సిస్టమ్ ఏది కావాలో ఎంచుకోవాలి. కీ బోర్డ్ కంఫర్టబుల్‌గా ఉందా, లేదా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఫోన్ చేతిలో ఇమిడిపోతోందా? కంఫర్ట్‌గా ఉందా? అనే విషయాన్ని గమనించాలి. చివరగా డిజైన్, లుక్ ఎలా ఉందో గమనించాలి. ఫీచర్స్‌తో పాటు ఆకర్షణీయంగా ఉన్న మోడల్‌ను ఎంచుకున్నప్పుడే బాగుంటుందని గుర్తుంచుకోవాలి.
హెచ్‌డీ డిస్‌ప్లే
కొన్నాళ్ల క్రితం వరకు ఫోన్ ఎంత చిన్నగా ఉంటే అంత స్టైల్‌గా భావించేవారు. కానీ ఇప్పుడు స్క్రీన్ పెద్దగా ఉండటం న్యూ ట్రెండ్. కనీసం 5 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఫోన్ ఎంచుకోవడం మంచిది. పిక్సెల్ కౌంట్ 720 ఉంటే చాలా నాణ్యమైన దృశ్యాలు చూడవచ్చు. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే పిక్సెల్ కౌంట్ కనీసం 250 పీపీఐ ఉన్నవి ఎంచుకోవాలి. అంతకన్నా తక్కువ ఉంటే ఎంచుకోకపోవడమే మంచిది. డిస్‌ప్లే సైజు పైనే కంఫర్ట్‌నెస్ ఆధారపడి ఉంటుంది. మంచి రిజల్యూషన్ ఉన్న మోడల్‌ను ఎంచుకుంటే ఫోటోలు, వీడియోలు నాణ్యమైనవి చూసే వీలు కలుగుతుంది.
2జిబి రామ్
స్మార్ట్‌ఫోన్ అంటేనే బోలెడు యాప్స్. ప్రతీపనికి యాప్స్ ఉపయోగించడం సాధారణమైపోయింది. మరి యాప్స్‌ను వేగంగా ఉపయోగించుకోవాలంటే ఫోన్ 2 జిబి రామ్ ఉండాల్సిందే. రామ్‌పైనే ఫోన్ వేగం ఆధారపడి ఉంటుంది. యాప్స్, మల్టీటాస్కింగ్, బూట్ టైమ్స్, గేమ్స్…ఇలా పని ఏదైనా రామ్ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎంచుకునే మోడల్‌లో 2బిజి రామ్ ఉందో లేదో కనుక్కోండి. ఒకవేళ అందుబాటులో లేకపోతే 1 జిబి రామ్ ఉన్న మోడల్స్‌ను ఎంచుకోవచ్చు. రెజల్యూషన్ ఎక్కువగా ఉన్న ఫోటోలను లోడ్ చేసుకోవాలన్నా, మొబైల్‌లో గేమ్స్ ఆడుకోవాలన్నా ఈ రామ్ ఉపయోగపడుతుంది.
స్టోరేజ్ కెపాసిటీ
ఫోటోలు, వీడియోలు, సినిమాలు, డాక్యుమెంట్లు, ఇతర ఫైల్స్… ఇలా ఏది సేవ్ చేసుకోవాలన్నా స్టోరేజ్ సదుపాయం ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ మీ పర్సనల్ కంప్యూటర్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఉండాలి. అలా ఉండాలంటే 16జిబి స్టోరేజ్ స్పేస్ ఉండాల్సిందే. అయితే అన్ని ఫోన్లలో ఈ ఫీచర్ ఉండదు. కానీ స్టోరేజ్ కెపాసిటీని ఎక్స్‌పాండ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. 16 జిబి వరకు ఎక్స్‌పాండ్ చేసుకునే ఫెసిలిటీ ఉన్న మోడల్‌ను ఎంచుకుంటే స్టోరేజ్ సమస్య లేకుండా ఉంటుంది. సాధారణంగా మొబైల్ స్టోరేజ్ తక్కువగా ఉంటుంది. ఎస్‌డీ కార్డులోనే స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మొబైల్ తీసుకునే ముందు ఎక్స్‌పాండబుల్ మెమొరీ ఫీచర్‌ను దృష్టిలో పెట్టుకోవాలి.
బ్యాటరీ లైఫ్
ఎన్ని ఫీచర్లు ఉన్నా, ఎన్ని అప్లికేషన్లు ఇన్‌స్టాల్ చేసుకున్నా బ్యాటరీ బ్యాకప్ బాగా లేకపోతే ఏదీ ఉపయోగం లేకుండా పోతుంది. కాసేపు గేమ్స్ ఆడితే బ్యాటరీ లో అని మెసేజ్ ప్రత్యక్షమైతే ఎక్కడ లేని చిరాకు వస్తుంది. అందుకే స్మార్ట్‌ఫోన్ తీసుకునే ముందు బ్యాటరీకి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. వీడియో కాల్స్ మాట్లాడినా, యాప్స్ రన్ చేసినా బ్యాటరీ లైఫ్ బాగుండేలా చూసుకోవాలి. కొన్ని మోడల్స్‌లో స్పెషల్ పవర్ సేవింగ్ ఫీచర్ ఉంటుంది. అలాంటి మోడల్‌ను ఎంచుకుంటే బ్యాటరీ సమస్య తలెత్తకుండా ఉంటుంది. సామ్‌సంగ్ గెలాక్సీ మోడల్స్‌లో పవర్ సేవింగ్ మోడ్ ఆప్షన్ ఉంది. ఇటువంటి మోడల్స్‌ను ఎంచుకుంటే బ్యాటరీ మన్నిక ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎన్ని మిల్లీ యాంప్ అవర్స్(ఎమ్ఎహెచ్)ల సామర్థ్యం ఉందో పరిశీలించాలి. స్టాండ్‌బై , టాక్‌టైం ఎన్ని గంటలు వస్తుందో తెలుసుకోవాలి. స్మార్ట్‌ఫోన్ కొనేముందు బ్యాటరీకి సంబంధించి ఈ అంశాలను తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి.
డ్యుయల్ కోర్
ఫోన్ కొనుగోలు చేసే ముందు దృష్టిలో పెట్టుకోవాల్సిన మరో అంశం ఇది. మొబైల్ తయారీలో డ్యూయర్ కోర్ చిప్‌సెట్స్ ఉపయోగించారా? లేక క్వాడ్ కోర్ చిప్‌సెట్స్ వాడారా? గమనించాలి. క్వాడ్ కోర్ చిప్‌సెట్స్‌తో సమానంగా లేదా మరింత సమర్ధవంతంగా డ్యూయల్ కోర్ చిప్స్ పనిచేస్తాయి. గెలాక్సీ ఎస్ 3 ఇందుకు మంచి ఉదాహరణ. ఇందులో డ్యూయల్ కోర్ క్వాల్‌కామ్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది క్వాడ్ కోర్ చిప్‌సెట్ కన్నా వేగంగా పనిచేస్తోంది. ఫోన్ యూసేజ్ స్మూత్‌గా ఉండాలంటే డ్యూయల్ కోర్ చిప్‌సెట్ ఉండాల్సిందే.
కెమెరా అంశాలు కీలకమే
స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా అంటే కేవలం ఫోటోలు, వీడియోలు తీయడానికే కాదు. కార్డ్‌స్కాన్‌ర్, ఓసీఆర్ అండ్ ఫేస్‌ట్రాకింగ్ వంటి పనులకు ఉపయోగపడుతుంది. అయితే మెగాపిక్సెల్ కౌంట్ కన్నా ఏ విధమైన సెన్సర్ ఉపయోగించారనే దానిపై దృష్టి సారించాలి. ఈ మధ్యకాలంలో బ్యాక్‌సైడ్ ఇల్యుమినేటెడ్ సెన్సర్(బీఎస్ఐ)ను వాడిన మోడల్స్ అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి వాటిని ఎంచుకుంటే మంచిది.
ఆపరేటింగ్ సిస్టమ్
ఫోన్ కొనేముందు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మొబైల్ కావాలో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వివిధ రకాల ప్రొగ్రామ్స్ రన్ కావడానికి ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, బ్లాక్‌బెర్రీ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్‌ను ఎంచుకుంటే కనుక ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. బ్లాక్‌బెర్రీ ఫోన్ కొనుగోలు చేస్తే బ్లాక్‌బెర్రీ ఓఎస్ ఉంటుంది. నోకియా మొబైల్స్‌లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సామ్‌సంగ్, సెల్‌కాన్, మైక్రోమాక్స్ వంటి మోడల్స్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మీరు ఎంచుకునే ఆపరేటింగ్ సిస్టమ్‌పైనే యాప్స్ ఇన్‌స్టాలేషన్ ఆధారపడి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మొబైల్‌ను ఎంచుకుంటే ఆండ్రాయిడ్ స్టోర్ నుంచి యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ కొనుగోలు చేసేముందు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మీ స్మార్ట్‌ఫోన్ ది బెస్ట్‌గా ఉంటుందనడంలో సందేహం లేదు