విస్తరిస్తున్న సెల్ఫి సంసృతి

 ఇటీవల సోషల్‌ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోన్న పదం… సెల్ఫీ. అతి తక్కువ సమయంలోనే ఈ సెల్ఫీ పెద్ద న్యూస్‌గా మారిపోయింది. ఈ పదం కొత్తగా అనిపించవచ్చు కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం చిన్నా, పెద్ద, యువత సెల్ఫీ మోజులో మునిగి తేలుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్‌ మీడియా పుణ్యమా అని ఈ సంస్కృతి మరింత శరవేగంగా పుంజుకుంటోంది. కెమెరా ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా మంది తమను తామే ఫోటో తీసుకోవడం, ఆ ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటం అనే పద్ధతి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ వ్యక్తీకరణ విధానాన్ని ఆంగ్లంలో సెల్ఫీ అంటున్నారు.  సింపుల్‌గా మన ఫోటోలను మనమే తీసుకోడాన్ని సెల్ఫీ అంటారు.
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ ప్లస్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లన్నీ ఒకదానికొకటి పోటీపడి మరీ ఈ సేవలను అందిస్తున్నాయి. తమ అభిరుచులు, అనుభవాలు, ఆనందాలు, విషాదాలను అందరితో పంచుకుని తమను తాము ప్రత్యేకంగా వ్యక్తీకరించుకునేందుకు ఇప్పుడు ఎక్కువమంది ఎంచుకున్న దారి సెల్ఫీ.
ఒకప్పుడు ఫోటోలు దిగాలంటే మరొకరి సాయం తప్పనిసరి. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ప్రతి ఒక్కరూ కెమెరామెన్‌ అయిపోతున్నారు. ఎవరికి వారే ‘సెల్ఫీ’లు తీసేసుకుని, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో పెట్టేస్తున్నారు. మరీ ముఖ్యంగా సెలెబ్రిటీలకు ఇదో సరదా అయిపోయింది. ఎలాబడితే అలా సెల్ఫీలు తీసుకుంటూ తమ స్నేహితులకు చూపించుకుని సంబర పడిపోతుంటారు. మరికొందరు మామూలుగా జ్ఞాపకాల కోసం ప్రత్యేకంగా తీసుకుంటారు. అది సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. స్మార్ట్‌ఫోన్‌ వున్న ప్రతిఒక్కరూ ఈ పద్ధతి అనుకరిస్తున్నారు. దీంతో ఫొటోషూట్స్‌లా కనిపించిన సోషల్‌ వెబ్‌సైట్లు ఇప్పుడు సెల్ఫీ ఫొటోలతో వినూత్నంగా దర్శనమిస్తున్నాయి. వింత అనుభూతులను కలిగిస్తున్నాయి. బైక్‌పై వెళ్లేటప్పుడు, పడుకునేటప్పుడు, తినేటప్పుడు, విహార యాత్రలకు వెళ్ళేటప్పుడు…. ఇలా ఎవరి స్టైల్‌లో వారు అప్పటికప్పుడు సెల్ఫీ ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇటీవల వచ్చిన ”మనం” సినిమాలో హీరో హీరోయిన్లు ఒక ట్రాఫిక్‌ జంక్షన్‌లో ఆగినప్పుడు పక్కనే వున్న క్లాక్‌ టవర్‌ కనిపించే విధంగా బండిమీద కూర్చునే ఫొటో తీసుకుంటారు. ఇలాంటి సన్నివేశాలు యువతరాన్ని చాలా త్వరగా ఆకర్షిస్తాయి. ఆ తరహా ఫొటోలను కూడా ఇప్పుడు ఫేస్‌బుక్‌ లాంటి సైట్లలో చూస్తున్నాము.
తమ జ్ఞాపకాలను పదిలపర్చుకోవడం కోసం ఫొటోలు తీసుకోవడం, తీయించుకోవడం వరకూ తప్పులేదు.  కాని ఒక ఇబ్బంది ఉంది ప్రతి స్మార్ట్ ఫోన్ గూగుల్ తో లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరు తీసే ప్రతి స్నాప్ కూడా గూగుల్ అకౌంట్ లో అప్లోడ్ అయి ఫ్రెండ్స్ కి  షేర్ చేయబడుతుంది.  కాబట్టి మీరు తీసుకునే సెల్ఫి లు కాటి ఫోటోలు కాని షేర్ సెట్టింగ్స్ సరిచూసుకోండి.  
టెక్నోలజి అనేది మన సౌకర్యంకోసం మనం తయారుచేసుకున్నది సరయిన రీతిలో ఉపయోగించుకుంటే సౌకర్యం లేకపోతే అది మన ప్రాణాల్ని మింగేసే అవకాసం ఉంది.  కాబట్టి జరా జాగ్రత్త.