ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ స్పీడ్‌గా పనిచేయాలంటే..?

చాలా మంది ఆండ్రాయిడ్ డివైస్ యూజర్లు ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి, ఫోన్ వేగంగా పనిచేయకపోవడం. హై కాన్ఫిగరేషన్ ఉన్న డివైస్ కొన్నప్పటికీ తమ ఫోన్ వేగంగా పనిచేయడం లేదని కొందరు ఎప్పుడూ కంప్లెయింట్ చేస్తుంటారు. అయితే డివైస్ ఒక వేళ నిజంగా అలా హై కాన్ఫిగరేషన్ అయి ఉండి వేగంగా పనిచేయకపోతే అప్పుడు అనుమానించాల్సిందే. ఎందుకంటే తక్కువ కాన్ఫిగరేషన్ ఉన్న డివైస్‌లైతే ఎలాగూ వేగంగా పనిచేయవు. అది అందరికీ తెలుసు. కానీ ఎక్కువ కాన్ఫిగరేషన్ ఉన్నప్పటికీ ఆయా ఫోన్లు నెమ్మదిగా పనిచేస్తుంటే అప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ పాటించాల్సి ఉంటుంది. దీంతో డివైస్ వేగం పెంచుకోవచ్చు. దాంతో స్పీడ్‌గా పనిచేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

డివైస్ గురించి తెలుసుకోండి…
మీరు కొన్న ఫోన్ హై కాన్ఫిగరేషన్ అయినా దాని సామర్థ్యానికి తగ్గట్టుగా దానిపై భారం వేయాలి. అంటే డివైస్ హార్డ్‌వేర్‌కు అనుగుణంగా అందులో యాప్‌లను ఓపెన్ చేయాలి. అంతేకానీ అది తెలుసుకోకుండా లెక్కకు మించిన యాప్స్‌ను ఒకేసారి ఓపెన్ చేస్తే దాంతో ఫోన్ స్లో అవుతుంది. అయితే క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్ ఉన్నవారు ఒకేసారి 2,3 యాప్స్‌ను లేదా ఒక 3డీ గేమ్‌ను ఆడుకోవచ్చు. అదే 2/3/4 జీబీ ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉన్నవారు ఇంకా ఎక్కువ ఎక్కువ యాప్స్‌ను, గేమ్స్‌ను రన్ చేసుకున్నా ఫోన్ స్లో అవదు.

ఆండ్రాయిడ్ అప్‌డేట్…
మీ ఫోన్‌కు చెందిన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్‌ను దాని తయారీదారు ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది. వాటిని కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలా చేస్తే ఫోన్‌లో ఉన్న ఎర్రర్స్ పోయి ఫోన్ వేగంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.

పనికి రాని యాప్స్…
చాలా మంది ఏం చేస్తారంటే అవసరం ఉన్నా లేకున్నా లెక్కకు మించిన యాప్స్‌ను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల ఫోన్‌లో మెమోరీ వాడకం పెరిగి దాంతో ఫోన్ స్లో అవుతుంది. కనుక మీకు పనికిరాని యాప్స్‌ను వెంటనే తీసేయండి. దీంతో ఫోన్ కొంత వేగం పుంజుకుంటుంది.

బ్లోట్‌వేర్…
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా కొన్ని యాప్స్‌ను ముందే ఇన్‌స్టాల్ చేసి ఇస్తారు. అలాంటి యాప్స్‌ను బ్లోట్ వేర్ అంటారు. అయితే బ్రాండెడ్ ఫోన్లలో ఈ యాప్స్ తక్కువే ఉంటాయి కానీ, తక్కువ ధర కలిగిన ఫోన్లలో ఇవి ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. దీంతో ఈ బ్లోట్‌వేర్ యాప్స్ డివైస్ పనితీరును దెబ్బ తీస్తాయి. ఫోన్ నెమ్మదిగా పనిచేసేలా చేస్తాయి. అయితే వీటిని డివైస్‌లోంచి తీసేయడానికి సాధ్యం కాదు. అలా కంపెనీ వాటిని ఇస్తుంది. కానీ వాటిని డిజేబుల్ చేస్తే చాలు, అవి ఎంతమాత్రం ఫోన్ మెమోరీని వాడుకోవు. కనుక మనకు ఎంతో కొంత మెమోరీ సేవ్ అవుతుంది. దీంతో ఫోన్ వేగంగా పనిచేస్తుంది.

అప్‌డేట్ యాప్స్…
మీరు మీ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్స్‌కు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తుంటాయి. వాటిని వాటి తయారీదార్లు విడుదల చేస్తారు. అలా ఎందుకు చేస్తారంటే… ముందు ఇచ్చిన వెర్షన్‌లో ఏవైనా ఎర్రర్స్ ఉంటే వాటిని సరి చేసి కొత్త అప్‌డేట్‌లో అందిస్తారు. కనుక ఆయా యాప్‌లకు కొత్త అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. దీంతో ఫోన్ మెమోరీపై భారం కూడా తగ్గుతుంది. డివైస్ స్పీడ్‌గా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.

మెమోరీ కార్డ్…
మనకు మార్కెట్‌లో 2జీబీ నుంచి 64 జీబీ వరకు మెమోరీ కార్డ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ మెమోరీ కార్డ్‌ను కొన్నా అది వేగంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి. అదెలాగంటే మెమోరీ కార్డ్‌లపై క్లాస్ 6, క్లాస్ 10 అని ఉంటుంది. ఇవే మెమోరీ కార్డులు వేగంగా పనిచేస్తాయి. కనుక వాటిని కొనుగోలు చేసి ఫోన్లలో వేస్తే డివైస్ వేగంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.

విడ్జెట్లు…
చాలా మంది తమ తమ ఫోన్ హోం స్క్రీన్‌లపై పవర్, వైఫై, బ్లూటూత్, వెదర్ వంటి పలు యాప్‌లకు చెందిన విడ్జెట్లను పెడుతుంటారు. అయితే నిజానికి ఇవి ఫోన్ మెమోరీని బాగా వాడుకుంటాయి. కనుక వీటిని తీసేస్తే డివైస్ వేగంగా పనిచేస్తుంది.

లైవ్ వాల్‌పేపర్లు…
సాధారణ వాల్ పేపర్లతో పోలిస్తే లైవ్ వాల్‌పేపర్లు ఎక్కువ మెమోరీని తీసుకుంటాయి. దీనికి తోడు బ్యాటరీ కూడా ఎక్కువగా ఖర్చవుతుంది. కనుక లైవ్ వాల్‌పేపర్స్‌ను పెట్టకపోవడమే మంచిది. దీంతో ఫోన్ స్పీడ్ అవుతుంది.

అకౌంట్స్ సింక్…
ఆండ్రాయిడ్ ఫోన్‌లో అకౌంట్స్ అండ్ సింక్ విభాగంలోకి వెళ్లి అన్ని యాప్‌లకు చెందిన ఆటో సింక్ ఫీచర్‌ను డిజేబుల్ చేయాలి. దీంతో ఎంతో మెమోరీ సేవ్ అవుతుంది. డివైస్ స్పీడ్ పెరుగుతుంది.

ఫైల్ క్లీనర్స్…
ఇక చివరిగా ఫైల్ క్లీనర్స్. ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో అనేకం లభిస్తున్నాయి. ఏదైనా ఓ మంచి ఫైల్ క్లీనర్ యాప్‌ను డివైస్‌లో వేసుకుని దాంతో ఎప్పటికప్పుడు జంక్ ఫైల్స్, ర్యామ్‌ను క్లియర్ చేసుకుంటుంటే దాంతో ఫోన్ వేగంగా పనిచేస్తుంది.